సైకిలెక్కి ఫ్యానుగాలికి చేతిలో గాజుగ్లాసుతో... ఓటెవరికో?


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుని దావానలంలా మండిపోతోంది. అన్ని ప్రధాన పార్టీల నాయకులూ మేమే గెలుస్తాం, మాదే అధికారం అంటూ మైకులెత్తి చాటేసుకుంటున్నారు. మరి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగబోతున్న ఎన్నికల్లో ఇంతకీ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేద్దామా!!!

2019 ఎలక్షన్స్ లో ఎవరి బలాబలాలు ఎంతమాత్రం? 



ముందుగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే... గత ఎన్నికల్లో ఓటమి శిఖరాల అంచుల దాకా వెళ్ళొచ్చి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన అధికారపగ్గాలు చేపట్టి ఐదు సంవత్సరాల అధికారాన్ని, నూతన రాష్ట్ర నిర్మాణాన్ని, ఆధునాతన రాజధాని నిర్మాణ బాధ్యతల్ని అందుకుంది. అయితే చెప్పిన మాటలు చెప్పినట్టుగా నిలబెట్టుకోవడంలో విఫలం కావడం, ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవడం, అవినీతి ఆరోపణలు, ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంతోనే మొత్తానికి ఐదేళ్ళ కాలాన్ని చుట్టేసింది. ఫలితం ఇప్పుడు ఎన్నికల్లో దాదాపుగా మరోసారి అధికారం చేజిక్కించుకోవడం కష్టతరమైన పనే అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం నా అభిప్రాయమే కాదండోయ్... లోలోపల సాక్షాత్తూ తెదేపా పెద్దలందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న భయంకరమైన నిజం.

స్కోర్ కార్డ్ లో ఉన్న అంచనాల ప్రకారం తెదేపాకు 175 లో దాదాపుగా 55 నుండి 65 సీట్లు దక్కే అవకాశాలున్నాయి.



ఇక అనుభవరాహిత్యం, అతినమ్మకం లాంటి కొన్ని కారణాలవల్ల చివరి రెండు, మూడు రోజుల్లో సరైన ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయలేకపోవడంతో గత ఎన్నికల్లో అధికారాన్ని కాసింతలో చేజార్చుకుని ప్రతిపక్షంగా మిగిలిపోయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్... వైయస్సార్సీపీ పరిస్థితి బాగా దృఢంగా ఉంది. పార్టీ అధ్యక్షుడు జగన్ అలుపెరగని రీతిలో ఏదో ఒక నినాదంతో, సమస్యతో నిరంతరాయంగా ప్రజల్లో ఉండడం బాగా కలిసొచ్చిన అంశం. దీని ఫలితంగానే గత కొన్ని రోజుల్లో అధికార పార్టీ నుండి సైతం ఎందరో నాయకులు వైకాపా లోకి దూకడం మనం చూశాం. ఉన్న బలంతో పాటూ ఈ బలాలూ తోడవడం కలిసొచ్చిన అదృష్టంగానే చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఈ దఫా అధికారం సొంతం చేసుకోవాలన్న యై.యస్.జగన్ కు తెలంగాణ నుండి కే.సీ.ఆర్, కేంద్రం నుండి భాజపా ల అదృశ్య మద్దతు కూడా కలిసొచ్చిన బలంగానే చెప్పుకోవాలి. దీంతో గెలవాలంటే ఇంకా ఏమేం చెయ్యాలి అన్న ఆలోచనలతో ఉన్న వైకాపా లో ఇప్పుడు గెలుపు ధీమా బాగానే కనిపిస్తోందని చెప్పొచ్చు.

స్కోర్ కార్డ్ లో ఉన్న అంచనాల ప్రకారం వైకాపాకు 175 లో దాదాపుగా 90 నుండి 100 సీట్లు దక్కే అవకాశాలున్నాయి.



అప్పట్లో అన్న మెగాస్టార్ చిరంజీవి భారీ అంచనాలతో ముఖ్యమంత్రి తానే అన్నచందాన ఆవిష్కరించిన నూతన రాజకీయ పార్టీ "ప్రజారాజ్యం" జెండాతో, "యువరాజ్యం" అధ్యక్షుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆరంగేట్రం చేసిన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ప్రజారాజ్యం ఘోరవైఫల్యంతో రాజకీయాల నుండి తాత్కాలికంగా పక్కకెళ్ళిపోయి మళ్ళీ తనదైన ముద్రతో "జనసేన" పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి ప్రజారాజ్యం కు వచ్చిన స్పందనకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అద్భుతమైన స్పందన పవన్ అభిమానుల నుండి రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే సినిమా అభిమానం, వ్యక్తి పూజ ఏమేరకు ఓటుబ్యాంక్ గా మారుతుందో వేచి చూడాల్సిందే. ఓటర్ నాడి తెలిసిన అనుభవజ్ణుల అంచనా ప్రకారం ప్రత్యక్ష రాజకీయాల్లో స్పందనకు, ఓటుబ్యాంక్ కు ఏ మాత్రం సంబంధం ఉండకపోవచ్చు. ఏదేమైనా ఈ సారి ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ "కింగ్" కాలేకపోవచ్చు కానీ "కింగ్ మేకర్" అయ్యే అవకాశాలయితే మెండుగా ఉన్నాయి [ఒకవేళ అధికార (తెదేపా), ప్రతిపక్ష (వైకాపా) పార్టీల మధ్య నేనంటే నేను అనే పోటీ గనక వచ్చినట్లయితేనే].

స్కోర్ కార్డ్ లో ఉన్న అంచనాల ప్రకారం జనసేన, బీఎస్పీ కూటమికి 175 లో దాదాపుగా 15 నుండి 30 సీట్లు దక్కే అవకాశాలున్నాయి.


ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా తెదేపా, వైకాపా, జనసేనల మధ్యే త్రిముఖ పోటీ ఉంటుంది. బతికి చెడ్డ కాంగ్రెస్, అంతగా ప్రభావితం చెయ్యలేని భాజపా, మిగిలిన ఇతర చిన్నాచితకా పార్టీలు మరియు ఇండిపెండెంట్లు అందరూ కలిసి పెద్దగా ఓటు బ్యాంక్ పరంగా, సీట్ల పరంగా తమ ముద్రను చూపించలేవన్నది తెలుగువారందరికీ తెలిసిన విషయమే.

స్కోర్ కార్డ్ లో ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్, భాజపా మరియు ఇతరులందరికీ కలిపి 175 లో దాదాపుగా 10 నుండి 20 సీట్లు దక్కే అవకాశాలున్నాయి.


ఈ అంచనాలను చూస్తే 2019లో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాల గాలి ఫ్యాన్ నుండే ఎక్కువగా వీస్తున్నట్టు తెలుస్తోంది. మరి తెలుగు వాడి ఓటరు నాడిని మార్చే, ఏమార్చే డబ్బు బలం విషయం కూడా మనం మరచిపోకూడదు.


***అందరికీ ఒకటే విన్నపం. డబ్బు తీసుకుని ఓటు వెయ్యడం కంటే డబ్బు తీసుకుని నోటాకు ఓటివ్వడం ఉత్తమం. అంతకంతే డబ్బుకు కాకుండా మీ మనస్సాక్షికి అమ్ముడుపోవడం అత్యుత్తమం.