రాజన్న అనుభూతుల “యాత్ర”


ముఖ్య గమనిక: తెలుపు, ఆకుపచ్చ, కాషాయం, పసుపు పచ్చ, నీలం వగైరా రంగుల జెండాలు, అజెండాలు కాసేపు పక్కనెట్టి ఈ విశ్లేషణ చదవాల్సిందిగా మనవి.

నిన్న మధ్యాహ్నం థియేటర్లో ఒంటరిగా కూర్చుని చాలా రోజుల తర్వాత తనివితీరా అనుభూతుల ఝడిలో తడిసి ముద్దయ్యా... చెరిగిపోని దరహాసాల ఝరి రాజన్న ను మళ్లీ ఓ సారి గుండెనిండుగా చూసుకున్నా. నేనేదో కాంగ్రెస్ వాదినో, లేక వైకాపా మద్దతుదారుడినో అనుకోకండి. "యాత్ర" సినిమా చూస్తున్నంత సేపు నాకు ఈ అనుభూతులే కలిగాయ్.

బయోపిక్ అంటే ఏంటో తెలుగువారికి అంత అనుభవజ్ణుడైన దర్శకుడు కాకపోయినా “మహి“ చూపించాడు మరి. అప్పట్లో వచ్చిన "సచిన్ టెండుల్కర్" బయోపిక్ ఒక నిజమైన బయోపిక్ అయితే మళ్లీ ఇప్పుడు ఈ యాత్ర వచ్చింది. బయోపిక్ అంటే నా ఉద్దేశ్యంలో పాత్రధారుడు మనకు కనిపించకూడదు, కేవలం ఆ పాత్ర మరోసారి మన కళ్ళ ముందు మెదలాలి. అదే అనుభూతి నాకు యాత్ర సినిమా చూస్తున్నంత సేపు కలిగింది. సినీ స్వాతంత్ర్యం తీసుకున్నప్పటికీ ఎక్కడా రాజన్న ఆత్మను పక్కకు పెట్టకుండా దర్శకుడు సినిమాను ముందుకు తీసికెళ్ళడంలో సక్సెస్ సాధించాడు.



కథ లేకుండా సినిమా తీసి చూపిస్తా అంటూ అప్పట్లో పూరీ బాబు మనపైకి ఓ చపాతీ విసిరాడు గుర్తుందా? రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన “దేవుడు చేసిన మనుషులు”... ఆ సినిమా చూశాక అయ్యో దేవుడు నన్నెందుకు మనిషిగా చేశాడ్రా బాబోయ్ అనిపించింది... ఇప్పుడీ అసదర్భ ప్రేలాపన ఎందుకయ్యా అంటే సందర్భం వచ్చింది కాబట్టే.

యాత్ర సినిమాలో కూడా నిజానికి పెద్దగా కథంటూ ఏమీలేదనే చెప్పాలి. కేవలం “వైయస్సార్ పాదయాత్ర ఆలోచన ఎలా పుట్టింది, ఎలా ముందుకు సాగింది” అనే చిన్న త్రెడ్ పై అల్లుకున్నదే... అఫ్ కోర్స్, నిజజీవిత సన్నివేశాలను ఆధారం చేసుకునే... అయినా సరే నాకయితే ఎక్కడా బోర్ అనే ఫీలింగే రాకుండా ఎమోషన్ డామినేట్ చేసేసింది.



రాజన్న గా మమ్ముట్టి అద్భుతంగా జీవించాడు అనడం కంటే, మమ్ముట్టి కనిపించకుండా కేవలం వైయస్సారే కనిపించేలా జాగ్రత్తపడ్డాడు అంటే బాగుంటుందేమో. ముఖ్యంగా చెప్పాల్సింది కేవీపీ గా రావు రమేశ్ సటిల్ గా చేసిన నటన, అద్భుతహ. సినిమాలో కొన్ని సన్నివేశాల దగ్గర ఒకరిద్దరు “కాస్త ఓవర్ చేశాడు డైరెక్టర్” అంటుంటే విన్నా. కానీ, నన్నడిగితే అంతకంతే ఓవర్ ఎమోషన్స్ నిజజీవితంలో, మనం టీవీల్లో అప్పట్లో లైవ్ లోనే చూసిన విషయం బహుశా వాళ్లకు గుర్తులేదేమో.


ఏదేమైనా మొత్తం మీద “యాత్ర” సినిమా నాకు ఓ మంచి అనుభూతుల యాత్ర ను మిగిల్చిన సినిమాగా గుర్తుండిపోతుంది అని చెప్పగలను.